అగ్గితెగులు రాగి పంటకు మూడు దశలలో సోకుతుంది.
నారుమడి దశలో సోకినట్లయితే మొక్కలు ఎండిపోతాయి.
ఎదిగిన మొక్కల ఆకులపై చిన్న చిన్న గోధుమరంగు మచ్చలు ఏర్పడి నూలు కండె ఆకారంలోకి మారుతాయి. మచ్చల అంచులు ముదురు గోధుమ రంగులో ఉండి మధ్య భాగం బూడిద రంగులో కనబడుతుంది. తెగులు పెరిగేకొద్దీ ఆకులు ఎండిపోయి పంట మొత్తం కాలిపోయినట్లు కనిపిస్తుంది అందువల్ల ఈ తెగులును "అగ్గితెగులు" అని పేరుతో పిలుస్తారు. కణుపుల మీద కూడా ఈ వ్యాధి నలుపు రంగు మచ్చలు రూపంలో కనిపిస్తుంది.
ఈ తెగులు కంకుల మెడభాగంపై ఆశించినపుడు నష్టం అధికంగా ఉంటుంది. తెగులు ఆశించిన భాగంలో కణజాలం నల్లగా మారి కుళ్లిపోవటం వళ్ళ వెన్నుల మెడవద్ద విరిగి క్రిందికి వాలిపోతాయి. ఫలితంగా వెన్ను భాగానికి ఆహార పదార్థాల సరఫరా ఆగిపోయి తాలుగింజలు ఏర్పడతాయి. తెగులు వెన్నులపై ఆశించినపుడు రెక్కలు నల్లగా మారి గింజ కట్టకుండా ఉండిపోతాయి.
నివారణా చర్యలు:
తెగులు తట్టుకొనే రకాలయిన శ్రీచైతన్య, వేదావతి, ఇంద్రావతి, సువర్ణముఖి, వకుళ మరియు తిరుమల రకాలను ఎన్నుకోవాలి. సిలీన్ద్రం కలుపు మొక్కలపై జీవిస్తుంది కాబట్టి పొలంగట్లపై మరియు పొలంలో కలుపు లేకుండా జాగ్రత్తపడాలి. నత్రజని ఎరువులను సిఫారసులకు మించి వాడరాదు. నారు నాటేముందు బ్లెయితకేస్ లేదా మాంకోజాబ్ మందును మూడు గ్రాములు లీటరు నీటికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.
నారుమడిలో మొక్కలు పసుపు రంగుకు మారి గుంపులుగా ఎండిపోతుంటే వెంటనే లీటరు నీటికి కార్బండిజమ్ 1 గ్రాము కలిపి నారుమడిపైన వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. మొక్కలపై అక్కడక్కడా మచ్చలు కనిపించినప్పుడు లీటరు నీటికి 1 గ్రాము కార్బండిజమ్ లేదా ట్రీసైక్లోజొల్ మందును కలిపి 15రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

