తమలపాకులను ఆయుర్వేదంలో కఫ, వాత, నోటి దుర్వాసన నివారణిగా, జీర్ణకారిణిగా వాడుతారు. తమలపాకులలో ఉండే నూనెకు యాంటిసెప్టిక్ గుణాలు కలవు.
వాతావరణం:
గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండి భూమిలో తగినంత తేమ కలిగిన ఉష్ణమండల ప్రాంతాలు తమలపాకు తోటలకు బాగా అనువైనవి. సంవత్సర వర్షపాతం 750 ml నుండి 1500 ml కలిగి ఉండి 10 నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్రత వ్యత్యాసం ఉన్న ప్రాంతాలలో ఆకు దిగుబడి ఎక్కువగా ఉంటుంది. వేడి గాలులు వీచే ప్రాంతాలలో తీగ చివరలు ఎండిపోయి ఆ తర్వాత తీగ అంతా చనిపోతుంది.
నేలలు:
మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్న సారవంతమైన భూములు ఆకు తోటలకు అనుకూలమైనవి. మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్న నల్ల రేగడి భూములలో కూడా తమలపాకుల సాగు చేసుకోవచ్చు. మురికి నీటి సౌకర్యం లేని భూములు, అధిక ఆమ్ల లేదా క్షారగుణం ఉన్న భూములు తమలపాకు తోటకు అనుకూలం కాదు.
తమలపాకు రకాలు:
తమలపాకులో ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. అవి కపూరి, బంగ్లా, మీఠా.
కపూరి:
మన రాష్ట్రంలో ఎక్కువగా కపూరి రకాలను పండిస్తారు. వీటిలో స్వర్ణ కపూరి, తెల్లాకు-పొన్నూరు, తెల్లాక-కడప, కూలజేడు కడప రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. వీటి ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉండి, మృదువుగా ఉంటాయి. ఈ రకపు తీగలకు కవటలు ఎక్కువగా ఉండి అధిక దిగుబడిని ఇస్తాయి.
బంగ్లా:
ఆకులు ముదురు ఆకుపచ్చ రంగు కలిగి ఘాటుగా ఉంటాయి. వీటిలో కవటలు తక్కువగా ఉండటం వలన తక్కువ దిగుబడి ఇస్తాయి. కారపాకు, కకేర్, గోడి బంగ్లా, నవ బంగ్లా వంటి రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి.
మీఠా:
ఈ ఆకులు తీపిగా ఉండి మంచి సువాసనను కలిగి ఉంటాయి. ఆకులు ముదురాకు పచ్చగా ఉండి తక్కువ కవటలతో తక్కువ దిగుబడినిస్తాయి. దీనినే కలకత్తా మీఠా పాన్ అని కూడా పిలుస్తారు. ఈ రకం మొక్కల సాగుకు ఎక్కువ నీడని కల్పించవలసి ఉంటుంది.
తమలపాకు సాగు / నాటుట:
భూమిని బాగా దున్ని సమం చేసి ఎకరాకు 16 నుంచి 20 కిలోల అవిస విత్తనాలను సాలుకు సాలుకు ఒక మీటర్ దూరం ఉండే విధంగా ఒత్తుగా విత్తుకోవాలి. విత్తనాలను ఉత్తరం నుండి దక్షిణం దిక్కుకు మాత్రమే విత్తుకోవాలి. విత్తిన రెండు నెలల తర్వాత సాళ్ల మధ్య మట్టిని చెక్కి ఆ మట్టిని అవిసె మొదళ్ళ వద్ద వేసి కయ్యలు చేసి వాటి మధ్య 50 సెంటీమీటర్ల లోతు 20 సెంటీమీటర్ల పొడవు 10 సెంటీమీటర్ల వెడల్పు గల గుంతలను 20 సెంటీమీటర్ల ఎడంతో తీసి ఎకరాకు 20,000 తమలపాకు తీగలను ఎన్నుకొని తీగలను నాటే ముందు 0.5% బోర్డో మిశ్రమం, 500 ppm స్ట్రెప్టో సైక్లిన్ మిశ్రమంలో 15 నుంచి 20 నిమిషాల పాటు తీగలను ముంచి శుద్ధి చేసుకోవాలి. నాటే ప్రతి తీగకు 6 నుంచి 8 కణుపులు ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. 2 నుంచి 3 కణుపులు నేలలోకి వెళ్లే విధంగా విత్తనపు తీగలను నాటుకోవాలి. నాటడానికి ముందుగానే నీరు పెట్టే కాలువలు, మురుగునీరు పోయే కాలువలు చేసుకోవాలి. చలి మరియు ఎండాకాలాల్లో తోట చుట్టూ గాలులు సోకకుండా దడులు కట్టుకోవాలి.
నీటి యాజమాన్యం:
తీగలు నాటిన అప్పటి నుంచి మూడు రోజుల వరకు రెండు పూటలా నీరు పెట్టాలి. తర్వాత మూడురోజులకు ఒక పూట అంటే సాయంకాలం మాత్రమే నీటిని కట్టవలెను. తర్వాత రోజు మార్చి రోజు 15 నుంచి 20 రోజుల వరకు నీటిని కట్టవలెను. డ్రిప్ ద్వారా నీటి తడులు ఇచ్చుకోవడం వల్ల నీటి అదా చేయడమే కాక మొదలు కుళ్ళు తీవ్రతను తగ్గించుకోవచ్చు.
తీగలు పాకించుట:
చిగురించిన తీగలు పెరగడం మొదలైన 5 రోజులకు జమ్ముతో అవిస మొక్కలకు కట్టి పాకించాలి. ఈ పనిని ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి చేసుకుంటూ ఉండాలి. అవిసె 4 మీటర్లు పెరిగిన తరువాత తలను తుంచి, ఎత్తుపెరగకుండా, చెట్టు బలమయ్యేటట్లు చూసుకోవాలి.
ఎరువులు:
తీగ నాటే ముందు దుక్కిలో ఒక ఎకరాకు 40 బండ్ల పశువుల ఎరువు 40 కిలోల సూపర్ ఫాస్ఫేట్ రూపంలో భాస్వరం, 40 కిలోల పొటాష్ (మ్యురేట్ అఫ్ పోటాష్ రూపంలో) ను కలిపి వేయాలి. తీగ నాటిన రెండు నెలల నుండి సంవత్సరానికి నత్రజనిని ఎకరాకు 80 కిలోల వేప పిండి, యూరియా 1:1 నిష్పత్తిలో నాలుగు నుండి ఆరు దఫాలుగా అందించాలి. ఒక ఎకరాకు ఒక టన్ను చొప్పున జిప్సం వేసుకోవచ్చు.
దింపకం వేయుట:
తమలపాకు తీగలు 4 నుంచి 5 మీటర్ల ఎత్తు పెరిగిన తర్వాత ఆకులు కోయడం కష్టమవుతుంది, కాబట్టి తీగను అవిశ కాండం నుంచి వేరు చేసి దిగువన ఉన్న ఆకులు, కొమ్మలు తీసివేసి తీగను చుట్టగా చుట్టి నేలకు తగిలేటట్లుగా ఉంచి చివర 50 సెంటీమీటర్ల పొడవున్న తీగ భాగాన్ని అవిశ మొక్కలకు కట్టి పాకనివ్వాలి. దీనినే దింపకం అంటారు. తొలి దింపకాల తర్వాత తోటలను “కోడే తోట” అంటారు. కోడే తోటలను కూడా మరల కొన్ని నెలల తరువాత దింపకం వేయాలి. రెండవసారి దింపకం వేసిన తోటను “ముది తోట” అని అంటారు.
ఆకుల కోత, దిగుబడి:
తీగ నాటిన రెండు నెలలకు ఆకులు కోతకు వస్తాయి. ఆ తర్వాత ప్రతి నెల ఆకులకు ఇనుప గోరు సహాయంతో కోయాలి. కోసిన ఆకులను పంతములుగా అమర్చి తడిగుడ్డ అమర్చిన వెదురు బుట్టలో పెట్టుకుని మార్కెట్ కు తీసుకెళ్లాలి. (పంతం అంటే 100 ఆకులు అని అర్థం). మొదటి సంవత్సరం మొక్క తోటల (కోడే తోట) నుండి ఎకరాకు 20 వేల నుండి 40 వేల పంతాలు వస్తాయి మరియు రెండవ సంవత్సరం (ముది తోట) 40 వేల పంతాలు దిగుబడి వస్తుంది.మూడవ సంవత్సరం తోటలో దాదాపు కోడే తోటతో సమానంగా దిగుబడి వచ్చినప్పటికీ ఆకు పరిమాణం తగ్గి మార్కెట్లో మంచి ధర పలకదు.