LATEST UPDATES

Tuesday, January 9, 2024

అల్లం లో దుంపకుళ్ళు తెగులు వాటి యాజమాన్యం

         అల్లం దుంప జాతి, ఔషధ మొక్క మరియు సుగంధద్రవ్యం గాను ఉపయోగిస్తారు. అల్లంలో దుంపకుళ్ళు తెగులు అధిక నష్టాన్ని కలుగచేసి దిగుబడి తగ్గిస్తోంది. మురుగునీటి కాలువలు లేకపోతె దుంపకుళ్ళు సమస్య ఎక్కువవుతుంది. ఎక్కువ వర్షపాతం, నీరు నిలిచే పరిస్థితులలో శిలీంద్రం వేగంగా అభివృద్ధి చెంది ఈ తెగులును తీవ్రంగా వ్యాపింపచేస్తుంది. భూమిలో కొమ్ములపై ఈ వ్యాధికారక శిలీంద్రాలు జీవించి ఉండి నీటి ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు ఆశించిన దుంపలు మెత్తగా అయ్యి చర్మం వదులుగా ఉండి ఊడివస్తుంది. తెగులు ఉదృతి ఎక్కువైనప్పుడు మొక్కలు ఎండి పడిపోతాయి. దుంపలు నిల్వ ఉంచినప్పుడు కూడా తెగులు ఉధృతి పెరిగి దుంపలు కుళ్లి పోతాయి. 
నివారణ చర్యలు: 
          ఆరోగ్యమైన తెగులు సోకని దుంపలను నాటుకోవటానికి విత్తనంగా ఎన్నుకోవాలి. దుంపలు నాటుకోవడానికి ముందు 5-7 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి పొడి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. మురుగునీటి కాల్వలు ఏర్పరచుకొని పొలంలో నీరు నిల్వ ఉండకుండా, కలుపు లేకుండా చూసుకోవాలి. ఒక అడుగు ఎత్తు, ఒక మీటరు వెడల్పు కలిగిన ఎత్తైన మడులను ఏర్పరుచుకొని దుంపలను నాటుకోవాలి. దుంపకుళ్ళు సోకిన మొక్కలను తీసివేసి కాల్చివేయాలి. తెగులు ఉదృతమైనప్పుడు మొక్కజొన్న, రాగి (లేదా) పప్పు ధాన్యాలతో పంట మార్పిడి చేసుకోవాలి. 
          సరైన ఎరువుల యాజమాన్యం పాటించాలి. వేపపిండి ఎరువును వేసుకోవాలి. తెగులు సోకిన మొక్కల మోదళ్ళల్లో మెటలాక్సిల్ (లేదా) మాంకోజెబ్ 5 గ్రాములు లీటరు నీటిలో కలుపుకొని పోసుకోవాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి తెగులు సోకిన మొక్కల చుట్టూ ఉన్న 4-5 మొక్కలకు వరుసల్లో పాదులను ముంపుగా తడపటం వలన దుంపకుళ్ళు తెగులు ఉదృతిని తగ్గించవచ్చు.


No comments:

Post a Comment

@2017 All Rights Reserved. Designed by WWW.SMARTWAY4STUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates