LATEST UPDATES

Monday, January 8, 2024

వరి నారుమడిలో ఆశించే పురుగులు

          సాధారణంగా వరి నారు మడిలో కాండం తొలిచే పురుగులు, తాటాకు (హిస్పా) తెగులు, ఉల్లికోడు, తామర పురుగులు, నారు కత్తిరించే లద్దె పురుగులు ఆశించి ఎక్కువ నష్టం కలుగ చేస్తాయి. కావున సకాలం లో ఈ పురుగుల ఉనికిని ఉదృతిని గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టి నారు మడి లో అధిక దిగుబడి సాధించవచ్చు. 


కాండం తొలిచే పురుగులు: 
        తల్లి రెక్కల పురుగులు పసుపు రంగులో ఉండి ముందు రెక్కల మీద నల్లటి మచ్చ కలిగి ఉంటాయి. ఈ పురుగులు వరి ఆకుల చివరి భాగాలలో గ్రుడ్లను పెట్టి గోధుమ రంగు వెంట్రుకలతో కప్పి ఉంచుతాయి. ఈ గుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగులు కాండం లోపలి రంధ్రం చేసుకొని వెళ్లి కణజాలాన్ని తింటూ కాండాన్ని తొలిచివేస్తాయి. దీని వల్ల మొవ్వు చనిపోవటంతో పాటు ఆకులు ఎండిపోతాయి. నారుమడి దశలోనే సస్యరక్షణా చర్యలు చేపట్టకపోతే ఇవి ప్రధాన పొలాన్ని ఆశించి తీవ్ర నష్టాన్నికలుగచేస్తాయి. కనుక ప్రధాన పొలంలో నారు నాటుకొనేటప్పుడు ఆకుల చివర్లు త్రుంచి నాటుకోవాలి. 

          ఈ పురుగుల నివారణకు ఒక చదరపు మీటరు నారుమడికి ఒక గ్రుడ్ల సముదాయము (లేదా) ఒక తల్లి రెక్కల పురుగు గమనించినట్లయితే 2.5 మి.లీ క్లోరోపైరిఫాస్ (లేదా) 1.5 గ్రా. ఎసిఫేట్ లేదా 2 గ్రా. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ (లేదా) 2.5 మి.లీ క్లోరంట్రానిలిప్రోల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా నారు తీయటానికి వారం రోజుల ముందు పలుచటి నీటి తడి ఇచ్చి 160 గ్రా. కార్బోఫ్యూరాన్ ౩G గుళికలు సెంటు నారుమడిలో వేసుకొన్నట్లయితే నారు మడిలోనే పురుగును నాశనం చేయవచ్చు. 

హిస్పా (తాటాకు) తెగులు: 
          ఈ పురుగులు పెంకు పురుగుల్లాగా నలుపు రంగులో ఉండి శరీరం మీద ముళ్ళు కలిగి ఉంటాయి. పిల్ల పురుగులు ఆకుపొరల మధ్యలోకి చొచ్చుకొనిపోయి పత్రహరితాన్ని గోకి తినటంవల్ల ఆకుల మీద తెల్లటి మచ్చలు ఏర్పడి క్రమేణా ఆకులు ఎండిపోతాయి. దూరం నుంచి చూస్తే ఈ పురుగు ఆశించిన నారుమడి ఎండిపోయినట్లు తాటాకుల్లాగా కనిపిస్తాయి. ఈ పురుగులు వరితో పాటుగా పొలంగట్ల మీద ఉండే గడ్డిజాతి మొక్కలను కూడా ఆశిస్తాయి. పొలంలో పంటలేనప్పుడు కలుపు మొక్కల మీద ఆశ్రయం పొంది పంట వేసిన తరువాత వరి పంటను ఆశించి నష్టం కలుగచేస్తాయి. కనుక, పొలం గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా ప్రధాన పొలంలో నారు నాటేటప్పుడు ఆకుల చివర్లు కత్తిరించడం ద్వారా పురుగు ప్రధాన పొలాన్ని ఆశించకుండా కాపాడుకోవచ్చు. దీని నివారణకు 2.0 మి.లీ ప్రాఫెనోఫాస్ (లేదా) 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ (లేదా) 2.5 మి.లీ క్లోరోపైరిఫాస్ ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 

ఉల్లికోడు: 

          ఈ పురుగులు ఎరుపు రంగులో ఉండి దోమల లాగా ఉంటాయి. ఇవి ఆకు తొడిమెలమీద గ్రుడ్లు పెడతాయి. వాటి నుండి వచ్చిన పిల్ల పురుగులు మొక్క అంకురం భాగాన్ని ఆశించి దానికి నష్టం కలుగచేస్తాయి. దీనితో పాటుగా కొన్ని రకాల రసాయన పదార్థాలను విడుదల చేయటం వల్ల అంకురం ఆకులాగా వృద్ధి చెందకుండా పొడవాటి గొట్టంలా మార్పు చెంది ఉల్లికోడులా బయటకు వస్తుంది. ఒక చదరపు మీటరుకు ఒక ఉల్లికోడు సోకిన పిలక గమనించిన వెంటనే సెంటు నారుమడికి 160 గ్రా. కార్బోఫ్యూరాన్ ౩G గుళికలు వేసుకోవాలి.

తామర పురుగులు: 
          మెట్ట నారుమళ్లలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తల్లి, పిల్ల పురుగులు ఆకుల అంచుల నుండి రసాన్ని పీల్చటం వాళ్ళ ఆకుల అంచులు పైకి చుట్టుకొనిపోతాయి. దీని నివారణకు 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ (లేదా) 2.0 మి.లీ ఫిప్రోనిల్ ను లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. 

నారు కత్తిరించే లద్దె పురుగులు: 
          ఈ లద్దె పురుగులు పగటి వేళల్లో మొక్క మొదళ్ల దగ్గర దాగి ఉండి రాత్రి వేళలో నారును కత్తిరించినట్లుగా కొరికి తింటాయి. దీని వలన నారుమడి పశువులు మేసినట్లుగా కనిపిస్తుంది. దీని నివారణకు నారుమడిని నీతితో నింపడం వలన లోపల ఉన్న పురుగులు బయటకు వస్తాయి. నీటిపై తేలుతున్న పురుగులను పక్షులు తిని కొంతవరకు నాశనం చేస్తాయి. దీనితో పాటు 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ (లేదా) 2.5 మి.లీ క్లోరోపైరిఫాస్ ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

No comments:

Post a Comment

@2017 All Rights Reserved. Designed by WWW.SMARTWAY4STUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates