LATEST UPDATES

Friday, December 22, 2023

బంగాళా దుంప సాగు, యాజమాన్య పద్ధతులు, విత్తన రకాలు


      బంగాళదుంప మొక్కలు సొలనేసి కుటుంబానికి చెందినవి. బంగాళదుంప శాస్త్రీయ నామం "సొలానమ్ ట్యూబరోసమ్".
          బంగాళదుంప మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రదేశాలలో, విశాఖపట్నం జిల్లాలోని అరకు చింతపల్లి మొదలగు కొండ ప్రాంతాలలో చల్లని ప్రదేశాలలో మాత్రమే పండిస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో అన్ని ప్రాంతాలకు అనువుగా ఉండే అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే రకములను సిమ్లా లోని కేంద్రీయ బంగాళాదుంప పరిశోధనా సంస్థ వారు రూపొందించారు. అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే బంగాళాదుంప రకాలు వాటి దిగుబడి వివరాలు: 
1.కుఫ్రి సూర్య: ఈ రకం పంటకాలం 90 రోజులు, దుంప కోలాకారంగా గోధుమ రంగులో ఉంటాయి. వీటి కండ లేత పసుపు రంగులో ఉంటుంది. ఈ రకం దుంపలను అధిక నాణ్యత కలిగిన చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీకి కూడా వాడవచ్చు. ఈ రకం బంగాళాదుంప ఆకులు ఎండు తెగులు, నల్లి తెగులు, దీపపు పురుగులను తట్టుకుంటుంది. ఎకరానికి 8 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. 
2.కుఫ్రి లీమా: ఈ రకం పంటకాలం 90 రోజులు, దుంప కోలాకారంగా తెల్లగా ఉంటాయి. వీటి కండ లేత పసుపు రంగులో ఉంటుంది. ఈ రకం బంగాళాదుంప నల్లి, దీపపు పురుగులను తట్టుకుంటుంది. ఎకరానికి 10 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. 
3.కుఫ్రి ఉదయ్: ఈ రకం దుంపలు ఎరుపు రంగులో ఉంటాయి. వీటి కండ పసుపు రంగులో ఉంటుంది. ఈ బంగాళాదుంప ఆకులు ఎండు తెగులును తట్టుకుంటుంది. ఎకరానికి 12-15 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఇసుక పాలు ఎక్కువగా ఉండే సారవంతమైన తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. నేలలో కొద్దిపాటి ఆమ్ల గుణం ఉంటే మంచిది. దుంపలను నాటే ముందు పొలాన్ని మూడు నుంచి నాలుగు సార్లు దున్ని గుల్ల పరచాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు ఇవి కాకుండా ట్రైకోడెర్మా, పాస్పో బ్యాక్టీరియా , సూడోమోనాస్, అజోస్పైరిల్లం, అజాటోబాక్టర్ వంటి జీవన ఎరువులు, జీవన శిలీంద్ర నాశనులను సిఫార్సు మేరకు వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. 
విత్తన దుంపలు: విత్తనం కోసం వాడే దుంపలు వైరస్, ఫంగస్, బ్యాక్టీరియా తెగుళ్లు సోకని ప్రదేశాల్లో ప్రత్యేకంగా పండించిన వాటిని మాత్రమే వాడాలి. పంజాబ్ రాష్ట్రంలో ఏరో ఫోనిక్స్ విధానంలో విత్తన దుంపలను పండిస్తున్నారు. 30 నుండి 40 గ్రాముల బరువు ఉన్న మొలకలు కలిగిన దుంపలను మాత్రమే విత్తన దుంపలు గా వాడాలి. విత్తనాన్ని నాటడానికి ముందు మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సి క్లోరైడ్ (లీటరు నీటికి 3 గ్రాముల మందు) కలిపిన నీటిలో ముంచి 5 నిమిషముల తర్వాత బయటకు తీసి ఆరబెట్టాలి. బోదెల మధ్య దూరం 60 cm ఉండేలాగా చూసుకోవాలి. సాళ్లలో దుంపలను 20cm దూరంలో వేసుకుని మట్టితో కప్పుకోవాలి. అక్టోబర్ చివరి వారం నుండి నవంబర్ మొదటివారం వరకు బంగాళదుంప నాటుకోవడానికి అనుకూలమైన సమయం. 
మట్టిని ఎగదోయడం:
        బంగాళదుంప సాగులో బోదెల పైకి మట్టిని ఎగదోయడం చాలా ముఖ్యమైనది. దుంపలు మొలకెత్తిన 20 రోజులకు ఒకసారి తర్వాత 30 రోజులకు ఒకసారి కలుపు తీసి పై పాటు ఎరువులు వేసి మట్టిని ఎగదోయాలి. ఇలా చేయడం వలన దుంపలు బాగా వృద్ధి చెందుతాయి. ఇలా చేయకపోతే దుంపలకు సూర్య రశ్మి తగిలి ఆకుపచ్చగా మారుతాయి. ఇటువంటి దుంపలకు మార్కెట్లో డిమాండ్ ఉండదు, అంతేకాకుండా ఇవి విషతుల్యం కూడా..,, 
దుంపల తవ్వకం: విత్తనం నాటిన నుంచి సుమారు 90 రోజులకు దుంపలను తవ్వుకోవచ్చు. దుంపలను తవ్వటానికి 10 రోజుల ముందు నీటి తడిని ఆపి వేయాలి. మొక్కలను వేట కొడవళ్లతో కోసి బోదెలపై వదిలివేయాలి. దీని వలన దుంపల పై సూర్యరశ్మి పడదు. మొక్కలను కోసిన తరువాత దుంపలను 10 రోజులు భూమిలోనే వదిలివేయాలి. దీని వలన దుంపలపై చర్మం గట్టిపడుతుంది. లేకపోతె చర్మం పొరలు పొరలుగా ఊడిపోతుంది. పది రోజుల తర్వాత దుంపలను నాగళ్లతో కానీ ట్రాక్టర్లతో కానీ కొన్ని తీయవచ్చు. తవ్విన దుంపలను నీడలో ఆరవేయాలి. సైజును బట్టి గ్రేడింగ్ చేసి గోనె సంచుల్లో నింపుకోవాలి.

No comments:

Post a Comment

@2017 All Rights Reserved. Designed by WWW.SMARTWAY4STUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates